జూబ్లీహిల్స్ ఉపఎన్నికల వేళ రాజకీయ వేడి పెరిగింది. బీజేపీ తరఫున ప్రచారం చేస్తున్న (KishanReddy) కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బోరబండ డివిజన్లో పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే మోరీలో వేసినట్టే” అని (KishanReddy) విమర్శించారు.
కిషన్ రెడ్డి మాట్లాడుతూ, “బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎంఐఎం కనుసన్నల్లో నడుస్తున్నాయి. ఎంఐఎంకు అభివృద్ధి అవసరం లేదు. ప్రజల సమస్యలకంటే మత రాజకీయాలు ముఖ్యమని వీరి చర్యలు చెబుతున్నాయి,” అన్నారు. కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయక మోసం చేసిందని, ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతోందని ప్రశ్నించారు.
అలాగే, “రెండేళ్లుగా వీధి లైట్లు కూడా వేయలేని దుస్థితి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. ఎంఐఎం దేశవ్యాప్తంగా పోటీ చేస్తే, జూబ్లీహిల్స్లో మాత్రం ఎందుకు పోటీ చేయడం లేదు? దారుస్సలాం నిర్ణయించిన అభ్యర్థికే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఇది ప్రజాస్వామ్యాన్ని అవమానపరచే చర్య” అని తీవ్రంగా విమర్శించారు.
కిషన్ రెడ్డి ఇంకా మాట్లాడుతూ, “బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ ఉంది? ఆ పార్టీ నుంచి ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరిపోయారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ కూడా ఫిరాయింపులను ప్రోత్సహించే పార్టీలే. ఈ పార్టీల డీఎన్ఏ ఒకటే. కుటుంబాల ప్రయోజనాల కోసం మాత్రమే పని చేస్తాయి,” అని ఆరోపించారు.
“బీఆర్ఎస్ కు ఓటేస్తే మోరీలో వేసినట్టే. ఆ పార్టీ ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేకపోయింది. ప్రజలు మోసపోవద్దు. జూబ్లీహిల్స్ ప్రజల కోసం అహర్నిశలు పనిచేస్తున్న దీపక్ రెడ్డిని గెలిపించండి,” అని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.
అంతేకాక, “ఇంటి ఇంటికి వెళ్లి ప్రచారం చేయండి. సభలు పెట్టడం మాత్రమే కాదు, జూబ్లీహిల్స్ ప్రజల భవిష్యత్తును కాపాడండి. బీజేపీకి ఓటు అంటే ధర్మానికి, న్యాయానికి ఓటు వేసినట్టే,” అని ఆయన అన్నారు. చివరగా, “మేమంతా – ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు – పూర్తి సమయం ఇక్కడే ఉంటాం. బీజేపీని గెలిపించడమే మా లక్ష్యం,” అని చెప్పారు.
Also read:

