వరంగల్ జిల్లాకు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న (MamunurAirport) మామునూర్ విమానాశ్రయం పునర్నిర్మాణానికి కీలక ముందడుగు పడింది. ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి, (MamunurAirport) మామునూర్ ఎయిర్‌పోర్టుకు అవసరమైన భూములను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI)కు అప్పగించింది. ఈ పరిణామంతో వరంగల్ ప్రజల కల అయిన విమానాశ్రయం త్వరలోనే నిజమయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ జనరల్ మేనేజర్ బీవీ రావు నేతృత్వంలోని బృందం వరంగల్ కలెక్టరేట్‌ను సందర్శించింది. జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆధ్వర్యంలో, రోడ్లు–భవనాల (R&B) శాఖ అధికారులు మామునూర్ విమానాశ్రయానికి సంబంధించిన భూముల పత్రాలను ఏఏఐ బృందానికి అధికారికంగా అప్పగించారు. ఈ కార్యక్రమం పూర్తవడంతో ప్రాజెక్ట్‌లో కీలక దశ ముగిసినట్లైంది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మామునూర్ విమానాశ్రయ పునర్నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించింది. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో పలుమార్లు చర్చలు జరిపి, ప్రాజెక్ట్‌కు సంబంధించిన అడ్డంకులను తొలగించే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా భూ సేకరణ అంశంలో ప్రభుత్వం వేగంగా, పారదర్శకంగా వ్యవహరించడం గమనార్హం.
మామునూర్ విమానాశ్రయ అభివృద్ధికి అవసరమైన మొత్తం 253 ఎకరాల భూమిని ప్రభుత్వం రైతుల నుంచి శాంతియుతంగా సేకరించింది. ఒక్కో ఎకరానికి రూ.1.20 కోట్ల చొప్పున న్యాయమైన పరిహారం చెల్లిస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భూ సేకరణ ప్రక్రియను పూర్తి చేసింది. సాధారణంగా ఇటువంటి పెద్ద ప్రాజెక్ట్‌లకు భూ సేకరణ సంవత్సరాల తరబడి ఆలస్యం అవుతుంటే, ఈ ప్రాజెక్ట్‌లో మాత్రం కేవలం ఏడాది కాలంలోనే భూముల సేకరణ పూర్తవడం విశేషంగా చెప్పుకోవచ్చు.
వరంగల్ వంటి చారిత్రక, విద్యా, వైద్య కేంద్రంగా ఎదుగుతున్న నగరానికి విమానాశ్రయం ఎంతో కీలకమని ప్రజలు భావిస్తున్నారు. మామునూర్ ఎయిర్‌పోర్టు పునర్నిర్మాణం పూర్తయితే వరంగల్‌తో పాటు ఉమ్మడి జిల్లాల ప్రజలకు రవాణా సౌకర్యాలు మరింత మెరుగవుతాయి. పారిశ్రామిక, వ్యాపార, పర్యాటక రంగాలకు ఊతం లభించనుంది. అలాగే యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉంది.
భూముల అప్పగింత పూర్తవడంతో ఇక ఎయిర్‌పోర్టు డిజైన్, నిర్మాణ పనులు, సాంకేతిక అనుమతులు వంటి తదుపరి దశలపై ఏఏఐ చర్యలు చేపట్టనుంది. ఈ ప్రాజెక్ట్ వేగంగా ముందుకు సాగి, త్వరలోనే మామునూర్ విమానాశ్రయం నుంచి విమానాలు ఎగరాలని వరంగల్ ప్రజలు ఆశాభావంతో ఎదురుచూస్తున్నారు.
Also read:
- DeskJournalists: కలెక్టరేట్ల ముందు డెస్క్‌జర్నలిస్టుల ధర్నా
- Danam Nagender: ఉపఎన్నిక వస్తే మళ్లీ గెలుస్తా

