మేడారం (Medaram) మహా జాతర సమీపిస్తున్న నేపథ్యంలో పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ మహా జాతరను చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. (Medaram) మేడారం సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం మొత్తం రూ.251 కోట్ల నిధులను కేటాయించింది. ఇందులో గద్దెల విస్తరణ పనులకే ప్రత్యేకంగా రూ.101 కోట్లను మంజూరు చేసింది.
ప్రస్తుతం మేడారంలో జరుగుతున్న నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. నాలుగు వేల టన్నుల గ్రానైట్ రాయితో గద్దెల ప్రాంగణాన్ని పటిష్టంగా నిర్మిస్తున్నారు. వందల సంవత్సరాల పాటు చెక్కుచెదరకుండా నిలిచేలా నిర్మాణం చేపడుతున్నారు. గతంలో మేడారం ఎలా ఉండేదో, ఇప్పుడు దర్శించబోయే మేడారం పూర్తిగా భిన్నంగా ఉండనుందని అధికారులు చెబుతున్నారు.
మేడారం జాతర పనుల్లో కోయ వంశీయుల సంప్రదాయానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. 750 మంది కోయ వంశీయుల పేర్లతో సంబంధం ఉన్న ఏడు వేలకుపైగా శిల్పాలను రూపొందించారు. ఈ శిల్పాలు గద్దెల ప్రాంగణానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. మొత్తం 46 స్తంభాలతో 271 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో భారీ ప్రాకారాన్ని నిర్మించారు. ఎనిమిది స్తంభాలతో వృత్తాకార గద్దె నిర్మాణ పనులు కూడా పూర్తయ్యే దశకు చేరుకున్నాయి.
భక్తులకు ఆహ్వానం పలికేలా స్వాగత తోరణాలను ఏర్పాటు చేస్తున్నారు. 40 అడుగుల వెడల్పుతో మూడు స్వాగత తోరణాలు నిర్మించారు. 30 అడుగుల వెడల్పుతో ఐదు తోరణాలు ఏర్పాటు చేశారు. ప్రధాన స్వాగత తోరణాన్ని 50 అడుగుల వెడల్పుతో నిర్మించారు. పూజారుల సంఘం ఆమోదంతో అన్ని పనులు సమన్వయంతో కొనసాగుతున్నాయి.
ఈ మహా జాతరను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, మంత్రి సీతక్క స్వయంగా పనులను పర్యవేక్షిస్తున్నారు. వందల ఏళ్ల పాటు నిలిచేలా గద్దెలను శాశ్వతంగా నిర్మించామని వారు స్పష్టం చేస్తున్నారు. మేడారం మహా జాతర చరిత్రలో ఇంత భారీ స్థాయిలో అభివృద్ధి పనులు జరగడం ఇదే తొలిసారి అని అధికారులు అంటున్నారు.
జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు మేడారం మహా జాతర జరగనుంది. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. లక్షలాది మంది భక్తులు జాతరకు తరలివచ్చే అవకాశం ఉండటంతో ఏర్పాట్లను మరింత వేగవంతం చేశారు.
భద్రతాపరమైన అంశాలపై పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి మేడారంలో పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. గత జాతరలో పనిచేసిన అనుభవం ఉన్న అధికారులను మళ్లీ అదే జోన్‌లు, సెక్టార్‌లలో నియమించాలని సూచించారు. అవసరమైన అదనపు సిబ్బందిని నియమించుకోవాలని ఆదేశించారు.
వైద్య శాఖ కూడా మేడారం జాతరకు సిద్ధమవుతోంది. నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాల వైద్యాధికారులతో సమన్వయ సమావేశం జరిగింది. స్పెషలిస్ట్ వైద్యులను మేడారం విధులకు నియమించాలని నిర్ణయించారు. ములుగు, నర్సంపేట, భూపాలపల్లి మెడికల్ కళాశాలల నుంచి వైద్యులను డిప్యుటేషన్ పై పంపనున్నారు. వైద్య సిబ్బంది, టెక్నీషియన్లను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచనున్నారు.
Also read:

