Ponguleti: బండి నడిపిన మంత్రులు

Ponguleti

మేడారం మహాజాతర నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. (Ponguleti) ఇందులో భాగంగా రాష్ట్ర మంత్రులు స్వయంగా రంగంలోకి దిగి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. మేడారంలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి (Ponguleti) పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్వయంగా బైక్ నడుపుతూ భక్తులకు కల్పించిన సౌకర్యాలను క్షేత్రస్థాయిలో పరిశీలించడం విశేషంగా నిలిచింది.

Image

శనివారం ఉదయం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్‌ను వెనక కూర్చోబెట్టుకొని తానే స్వయంగా బండి నడుపుతూ మేడారం ప్రాంతాన్ని పర్యవేక్షించారు. హరిత హోటల్, మ్యూజియం, ఆర్టీసీ బస్టాండ్, ప్రధాన రహదారులు, భక్తుల రాకపోకల ప్రాంతాలు తదితర కీలక ప్రాంతాల్లో తిరుగుతూ ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలించారు. భక్తులకు ఎక్కడైనా అసౌకర్యాలు ఉన్నాయా అనే అంశాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Image

ఇదే సమయంలో మరో బండిపై రాష్ట్ర గిరిజన సంక్షేమం, సాంస్కృతిక శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ కూడా బైక్ నడుపుతూ మంత్రితో కలిసి పర్యటనలో పాల్గొన్నారు. గిరిజన సంప్రదాయాలకు ప్రతీక అయిన మేడారం జాతరను విజయవంతంగా నిర్వహించేందుకు తీసుకుంటున్న చర్యలను ఆయన పరిశీలించారు. ఇద్దరు మంత్రులు కలిసి జాతర ప్రాంతమంతా తిరుగుతూ భక్తుల సౌకర్యాలు, భద్రత, మౌలిక వసతులపై సమగ్రంగా అంచనా వేశారు.

మహాజాతరకు విచ్చేసిన భక్తులు విడిది చేసిన ప్రాంతాలను సైతం మంత్రులు పరిశీలించారు. తాత్కాలిక శిబిరాలు, తాగునీటి వసతి, మరుగుదొడ్లు, విద్యుత్ సరఫరా, వైద్య సదుపాయాలు వంటి అంశాలపై అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు. భక్తులు సుఖంగా విశ్రాంతి తీసుకునేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ట్రాఫిక్ నిర్వహణ, ఆర్టీసీ బస్సుల రాకపోకలు, అత్యవసర వాహనాల కదలికలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రులు స్పష్టం చేశారు. ఎక్కడ ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా భక్తులు సజావుగా మేడారం తల్లులను దర్శించుకునేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

ప్రత్యేకించి వృద్ధులు, మహిళలు, పిల్లలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలని, భద్రతా చర్యలు మరింత పటిష్టంగా అమలు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. భక్తుల భద్రతే ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యమని మంత్రులు తెలిపారు.

మంత్రులు స్వయంగా బైక్ నడుపుతూ ఏర్పాట్లను పరిశీలించడం జాతర నిర్వహణపై ప్రభుత్వ నిబద్ధతను చాటింది. మేడారం మహాజాతరను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధల మధ్య విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రులు స్పష్టం చేశారు.

Also read: